Reproduction system in plants

 మొక్కలలో ప్రత్యుత్పత్తి



         ఉమ్మెత్త, మందార (దాసాని), గుమ్మడి, సొర,గడ్డిచేమంతి, పొద్దుతిరుగుడు, సన్నజాజి మొదలైన పూలను సేకరించండి. వాటిని పరిశీలించండి. ఈ పూలన్నిటికి ఒకే ఆకారం, పరిమాణం ఉన్నాయా? మీరు సేకరించిన పుష్పాల బొమ్మలు గియండి.
ఉమ్మెత్తపువ్వును తీసుకొని దానిలోని భాగాలను పరిశీలిద్దాం.


పుష్పాసనం :

               పుష్పంలోని భాగాలను అధ్యయనం చేయడానికి మీరు సేకరించిన ఉమ్మెత్తపువ్వు కాడను పట్టుకుని పరిశీలించండి. కాడ ఆకుపచ్చని రంగులో ఉంటుంది. పువ్వు ప్రారంభమయ్యేచోట కాడ కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. దీన్ని 'పుష్పాసనం' అంటారు. ఇది పువ్వులోని భాగాలన్నిటికీ పీఠంలాగ పనిచేస్తుంది.
ఇప్పుడు పుష్పాసనం పైభాగాన్ని పరిశీలించండి.

రక్షక పత్రావళి :

            ఆకుపచ్చని గొట్టంలా ఉండే నిర్మాణాన్ని ’చూడండి. దీన్ని'రక్షకపత్రావళి' అంటారు. వీటి చివరలు సన్నని ఆకుల్లా కనిపిస్తున్నాయి కదా! వీటిని 'రక్షకపత్రాలు’ అంటారు. అంటే రక్షక పత్రాల దిగువ భాగాలు అన్నీ కలిసిపోయి గొట్టంలా ఏర్పడ్డాయన్నమాట. మీ నోటుపుస్తకంలో రక్షకపత్రాల బొమ్మగీయండి.

ఆకర్షణ పత్రావళి :

         ఈ రక్షక పత్రాలను నెమ్మదిగా వేరుచేసితీసివేయండి. మీరేం గమనించారు. గరాటు ఆకారంలో ఉండే తెల్లని భాగం కనిపిస్తోంది కదా! దీన్ని 'ఆకర్షణ పత్రావళి' అంటారు. ఆకర్షణపత్రాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి గరాటులా ఏర్పడ్డాయి. ఆకర్షణపత్రాలను లెక్కించండి. ఇవి ఎన్ని ఉన్నాయి. ఏ రంగులో ఉన్నాయి? సాధారణంగా మనం ఆకర్షణపత్రాలను పూవుగా అనుకుంటూంటాం. మీ నోటుపుస్తకంలో ఆకర్షణపత్రావళి బొమ్మ గీయండి.

కేసరావళి :


             ఆకర్షణపత్రాలను తొలగించి చూడండి. వాటి లోపలివైపు పరిశీలించండి. సన్నని, మెత్తని, పొడవైన నిర్మాణాలు ఆకర్షణ పత్రాలకు అంటుకున్నట్లుగా కనిపిస్తాయి. దీన్ని 'కేసరదండం' అంటారు. ఉమ్మెత్త పువ్వులో ఎన్ని కేసరదండాలు ఉన్నాయి? కేసరదండం చివరలో ఉబ్బెత్తుగా కనిపిస్తోంది కదా! దీన్ని ‘పరాగకోశం' అంటారు. కేసరదండానికి ఒక చివర పరాగకోశం ఉండి మరొక చివర ఆకర్షణపత్రాలకు అంటుకున్నట్లుగా కేసరదండం ఉంది. కదా! సాధారణంగా పుష్పంలో ఉండే కేసరదండాన్నీ, పరాగకోశాన్నీ కలిపి "పురుష ప్రత్యుత్పత్తి భాగాలు(Androecium)” అంటారు. మీ నోటుపుస్తకంలో వీటి బొమ్మను గీయండి.


అండకోశం :

                 ఇప్పుడు కేసరావళితో సహా ఆకర్షణ పత్రాలన్నింటినీ తీసివేయండి. పుష్పాసనాన్ని పరిశీలించండి. పుష్పాసనంమీద ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణం కనిపిస్తుంది. దీన్ని ‘అండాశయం’ అంటారు. బల్బుమాదిరిగా ఉబ్బి ఉంది కదా! దీనిపైన ఉన్న సన్నటి గొట్టం వంటి దాన్ని ‘కీలం’ అంటారు. కీలం చివరి భాగాన్ని 'కీలాగ్రం' అంటారు. అండకోశంలో ఉండే అండాశయాన్నీ, కీలాన్నీ, కీలాగ్రాన్నీ “స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు (Gynoecium)” అంటారు. ఉమ్మెత్త పువ్వులో ఎన్ని అండకోశాలు మీకు కనిపిస్తున్నాయి? మీ నోటు పుస్తకంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాల బొమ్మ గీయండి. ఉమ్మెత్త పుష్పంలో భాగాలన్నీ వివిధ వలయాలలో అమరి ఉన్నట్లు మనకు కనిపిస్తోంది కదా! ఏ వలయంలో ఏ ఏ పుష్పభాగాలు కనిపిస్తున్నాయో మీరు సేకరించిన పుష్పాలలో పరిశీలించండి. మీ పరిశీలనలను కింది పట్టికలో రాయండి.

                మీరు సేకరించిన పుష్పాలలో స్త్రీభాగాలను పరిశీలించండి. పుష్పాలన్నింటిలోనూ అండకోశం, అండాశయం, అండం, కీలం, కీలాగ్రం మొదలైన భాగాలన్నీ ఉన్నాయా? అవి ఎలా ఉన్నాయి? పురుష భాగాల మాదిరిగానే స్త్రీభాగాలు కూడా ఒక్కొక్క పుష్పంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. పటం-4లో వేరువేరు పుష్పాల రకరకాల అండకోశాలను పరిశీలించండి.


                    గుమ్మడి, దోస, సొర మొదలైన పుష్పాలలో నాలుగు వలయాలలో పుష్పభాగాలున్నాయా? దోస, సొర పుష్పాలలో రెండు రకాల పుష్పాలు కనబడతాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించండి. వాటి మధ్య తేడాను గుర్తించండి. పురుష పుష్పాలను, స్త్రీ పుష్పాలను గుర్తించగలిగారా? కింది పటం సహాయంతో గుర్తించడానికి ప్రయత్నించండి.

             పురుష పుష్పాలు, స్త్రీ పుష్పాలు వేరువేరుగా ఉండే మరికొన్ని మొక్కలకు ఉదాహరణలివ్వండి. గడ్డిచేమంతి, పొద్దుతిరుగుడు పుష్పాలు చూడడానికి ఒకే పుష్పం లాగా కనబడినప్పటికి.నిజానికి ఇది పుష్పగుచ్ఛం. పుష్పగుచ్ఛంలోని చిన్నచిన్న పుష్పాలను 'పుష్పకాలు' అంటారు. పై తరగతులలో వాటిని గురించి మరింత తెలుసుకుంటారు.

పుష్పాలలో ఉండే భాగాల ఆధారంగా కూడా పుష్పాలను రకరకాలుగా విభజిస్తారు.

సంపూర్ణ పుష్పం :


ఈ రకం పుష్పాలలో నాలుగు వలయాలలో పుష్పభాగాలు ఉంటాయి. మొదటి వలయంలో రక్షకపత్రాలు, రెండో వలయంలో ఆకర్షణపత్రాలు, మూడో వలయంలో కేసరావళి, నాలుగో వలయంలో అండకోశాలు
ఉన్నట్లయితే అటువంటి పుష్పాలను సంపూర్ణ పుష్పాలు అంటారు.
ఉదా :మందార, ఉమ్మెత్త, తూటిపూలు


అసంపూర్ణ పుష్పం :


           నాలుగు వలయాలలో ఒక్క వలయం ఏ లేకపోయినా అటువంటి పుష్పాలను అసంపూర్ణ పుష్పాలు అంటారు.
ఉదా : దోస, సొర, బొప్పాయి. ఆలోచించండి - లిల్లీ పూలలో రక్షకపత్రాలు, ఆకర్షణపత్రాలు అని విడివిడిగా ఉండవు. రెండూ కలిసిపోయి ఉంటాయి. అంటే దీనిలో 3 వలయాలు మాత్రమే ఉంటాయన్నమాట. దీన్ని సంపూర్ణ పుష్పం అనవచ్చా?


ఏకలింగ పుష్పాలు :


         కేసరావళికాని, అండకోశంకాని ఏదో ఒక్కటే ఉన్నట్లయితే అటువంటి పుష్పాలను 'ఏకలింగ పుష్పాలు' అంటారు. ఉదా : దోస, సొర, కాకర ఏకలింగ పుష్పాలు రెండు రకాలు.


ఎ) పురుష పుష్పాలు :

కేసరావళి మాత్రమే ఉంటుంది. అండకోశం ఉండదు.

బి) స్త్రీ పుష్పాలు :


అండకోశం మాత్రమే ఉంటుంది. కేసరావళి
ఉండదు.
వీటిని సంపూర్ణ పుష్పాలు అనవచ్చా? ఎందువల్ల?

ద్విలైంగిక పుష్పాలు :


కేసరావళి, అండకోశం రెండూ ఉన్న పుష్పాలను ‘ఉభయలైంగిక పుష్పాలు' లేదా 'ద్విలైంగిక పుష్పాలు' అంటారు. ఉదా: ఉమ్మెత్త, మందార, తూటిపూలు.


పుష్పం - లైంగిక భాగాలు :

  ఉమ్మెత్త పుష్పం నుంచి కేసరావళిని వేరుచేయండి. దాని పరాగకోశాన్ని గాజుపలకపైన నెమ్మదిగా తట్టండి. పరాగకోశాలనుంచి కొన్ని చిన్నచిన్న రేణువులు రాలి పడడం చూస్తారు. ఈ రేణువులమీద నీటిచుక్క వేసి సూక్ష్మదర్శిని కింద చూడండి.



వీటిని పరాగరేణువులు అంటారు. పరాగరేణువులు పురుష బీజాలను ఉత్పత్తి చేస్తాయి. వివిధ రకాల పుష్పాల పరాగరేణువులను సేకరించి సూక్ష్మదర్శినిలో పరిశీలించండి. అన్నిటికీ ఒకే రంగూ, ఆకారమూ ఉన్నాయా? మీ పరిశీలనలను పట్టికలో నమోదుచేయండి. వాటి చిత్రాలను మీ నోటుపుస్తకంలో గీయండి.
లోపలిభాగాలు చూడడానికి వీలుగా ఉండే ఉమ్మెత్త అండకోశాన్ని సేకరించండి. పటం-8(ఎ), పటం-8(బి)లో చూపినట్లుగా బ్లేడుతో కోయండి.
భూతద్దంతో, లోపలి భాగాలను పరిశీలించండి.

మీరు ఏం గమనించారు? చిన్నచిన్న బంతులవంటివి కనబడుతున్నాయి కదా! వీటిని ‘అండాలు' అంటారు. అండాశయంలో అండాలు వేరువేరు గదులలో అమరి ఉంటాయి. అండాలలో స్త్రీ సంయోగబీజాలు ఉంటాయి. మీరు సేకరించిన వివిధ రకాల పుష్పాలలో అడ్డుకోత తీసి అండాలను పరిశీలించండి. వాటి బొమ్మలను గీయండి.

పువ్వులో ఏ భాగం ఫలంగా మారుతుంది

ఉమ్మెత్త మొక్కనుండి అండకోశాన్ని, ఫలాన్ని (కాయ) సేకరించండి. రెండింటికి అడ్డుకోత తీయండి. లోపలి భాగాలను భూతద్దంతో పరిశీలించండి. రెండింటి మధ్య ఏమైనా పోలికలు గుర్తించారా?

కాకరకాయ, దోసకాయ, బెండకాయ, పత్తి చిక్కుడు మొక్కల అండాశయాన్నీ, ఫలాన్నీ అడ్డుకోత తీసి పరిశీలించండి. పరిశీలనలను నమోదుచేయండి. అండాశయానికీ, ఫలానికీ మధ్య కనబడే పోలికలు ఏమిటి?

అండాశయం ఫలంగా మారుతుంది. అందులోని అండాలు విత్తనాలు గా మారతాయి. విత్తనాలనుండి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి.

అండాశయం దానంతట అదే ఫలంగా మారుతుందా?

తోటలో పెరుగుతున్న సొరమొక్కను పరిశీలించండి. ఇందులో ఏకలింగపుష్పాలు ఉంటాయి. పురుషపుష్పాలు, స్త్రీపుష్పాలు వేరువేరుగా ఉంటాయి. స్త్రీపుష్పాలున్న పది మొగ్గలను ఎంపికచేసి వాటికి పాలిథిన్ సంచి తొడిగి కాడ భాగానికి వదులుగా ముడివేయండి. గుండుసూదితో పాలిథీన్ సంచిపై చిన్నచిన్న రంధ్రాలు చేయండి.

రెండు రోజుల తరవాత మొగ్గలు వికసించడం ప్రారంభిస్తాయి (సొరకాయ పురుషపుష్పంనుంచి పరాగరేణువులను సేకరించండి). మగపుష్పంనుంచి కేసరాలను, తెల్లనికాగితంపైన ఉంచి నెమ్మదిగా తట్టండి. పరాగరేణువులను సేకరించి అగ్గిపుల్లకొన భాగానికి దూదిని చుట్టి బ్రష్ మాదిరిగా తయారుచేయండి. పది స్త్రీ పుష్పాలలో ఐదు స్త్రీ పుష్పాలకు పాలిథిన్ సంచి విప్పి బ్రష్తో పరాగ రేణువులను కీలాగ్రంపైన పెట్టండి.

పరాగరేణువులు కీలాగ్రానికి అతుక్కుంటాయి. మళ్ళీ పుష్పాలను పాలిథీన్ సంచితో కప్పండి. మొక్క నుండి అన్ని పురుష పుష్పాలనూ తొలగించండి. పరాగ రేణువులు స్త్రీ పుష్పాలకు చేరకుండా చూడండి.

ఒక మొక్కలోని పరాగకోశంలోని పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరే విధానాన్ని పరాగ సంపర్కం అంటాం. వారం తరవాత పరాగ సంపర్కం జరిగిన, జరగని పుష్పాలను పరిశీలించండి. పరాగ సంపర్కం జరిగిన పుష్పాలు ఫలాలుగా మారతాయి. పరాగ సంపర్కం జరగని పుష్పాలు ఎండిపోతాయి.


  • రక్షకపత్రాలచేత కప్పి ఉన్న మొగ్గతో ఈ ప్రయోగం నిర్వహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?


  • మొగ్గలను పాలీథిన్ సంచితో ఎందుకు కప్పారు? పరాగ సంపర్కం జరపిన పుష్పాలను కూడా పాలిథీన్ సంచితో ఎందుకు కప్పారు?


పరాగకోశంనుంచి పరాగ రేణువులు కీలాగ్రానికి చేరడాన్ని 'పరాగ సంపర్కం' అంటారు.

ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రం చేరడాన్ని ‘ఆత్మపరాగ సంపర్కం / స్వపరాగ సంపర్కం’ అంటారు.

ఒక పుష్పంలోని పరాగరేణువులు మరో పుష్పంలోని 'పరపరాగ సంపర్కం' అంటారు. 


పరాగసంపర్కం వాహకాలు :

పరాగరేణువులు కీలాగ్రానికి ఎలా చేరతాయి? ద్వారా, ద్వారా, జంతువుల ద్వారా, ద్వారా, మనుషుల ద్వారా పరాగరేణువులు కీలాగ్రానికి చేరతాయి. సీతాకోకచిలుకల వంటి కీటకాలుమకరందం కోసం పూలమీద వాలినప్పుడు పరాగరేణువులు కీటకాల కాళ్లకు అంటుకుంటాయి. అది వేరొక పుష్పంమీద వాలినప్పుడు ఈ పరాగరేణువులు కీలాగ్రానికి చేరతాయి. పరాగసంపర్కం జరిగిన తరవాత పరాగరేణువులు ఏమవుతాయి?

మీకు తెలుసా?

పక్షులు, కీటకాలు సహజమైన పరాగసంపర్క వాహకాలుగా పనిచేస్తాయి. ఈ మధ్యకాలంలో రైతులు పంటపొలాలలో తెగుళ్ళను నివారించడానికి విపరీతంగా పురుగు మందులను ఉపయోగిస్తున్నారు. అందువల్ల కీటకాలు చనిపోతున్నాయి. ఇది పరాగ సంపర్కంమీద ప్రభావం చూపుతుంది. అందువల్ల పంటల ఉత్పత్తి తగ్గిపోతూంది. ప్రధానంగా పొద్దుతిరుగుడులో ఈ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల రైతులు గుడ్డలతో అద్ది పరాగసంపర్కం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.





Post a Comment

0 Comments